Thursday, June 25, 2015

వైదేహి ఆశ్రమం: ఆ అమ్మాయిల్ని అత్తారిళ్లకీ పంపిస్తాం!

Source: http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/aa-ammaayilniattaarillaki-pampistaan-newsid-41160022
(25 Jun) వైదేహి ఆశ్రమం... తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న అమ్మాయిలకే కాదు.. అనాథలకూ ఇదో ఆశ్రయం ఇచ్చే సంస్థ. అలాంటి అమ్మాయిలను చేరదీయడమే కాదు... వాళ్లు కోరుకున్న చదువు చెప్పించి.. పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించే వరకూ అండగా ఉంటారు. అసలు ఇదెలా ప్రారంభమైందో చెబుతున్నారు ఆశ్రమ నిర్వహణ చూస్తూ, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సీతా కుమారి.ద్దరమ్మాయిలు ఎంటెక్‌ పూర్తిచేస్తే వురో అమ్మాయి బీటెక్‌ చదువుతోంది. ఇంకొకరు ఎంబీఏ. మరికొందరు పాలిటెక్నిక్‌. కొందరు ఇంకా చదువుకుంటున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు ఇరవైనాలుగు మంది అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుని అత్తింట్లో ఆనందంగా ఉన్నారు. 

చదువేదయినా, ఉద్యోగాలు చేస్తున్నా సరే.. ఇక్కడున్న మా అందరిదీ ఒకే కుటుంబం. ఈ ఆశ్రమం కార్యక్రమాలన్నీ సేవాభారతిలో భాగం. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. 

అది 1993... శిశుమందిర్‌లో కొన్ని తరగతి గదులు ఖాళీగా ఉండేవి. అది చూశాక మాలో కొందరు కార్యకర్తలకు ఆ గదుల్ని అద్దెకు తీసుకుని అనాథలకూ, నిరాశ్రయుకూ సాయం చేయాలని అనిపించింది. అలా మొదట ముగ్గురు అమ్మాయిలతో ఇది ప్రారంభమైంది. అయితే అమ్మాయిల సంరక్షణ అంటే మాటలు కాదు. స్త్రీలు ఉండాలి. మా పనుల గురించి తెలిశాక, ఓ రోజు భర్త పోయి ఇద్దరు అమ్మాయిలున్న మహిళ మా దగ్గరకు వచ్చింది. తమకు ఆసరా కల్పిస్తే ఆ పిల్లల బాధ్యత తాను చూస్తానని చెప్పింది. ఆమె పిల్లలతో సంఖ్య పెరిగింది. 

కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు.. కడప, మహబూబ్‌నగర్‌, నేపాల్‌ లాంటి చోట్ల నుంచి వచ్చే అమ్మాయిలు ఉంటారు. మహబూబ్‌నగర్‌ నుంచి దాదాపు తొమ్మిదిమంది అమ్మాయిలు ఇక్కడకు వచ్చారు..తప్పనిసరిగా ఆ పిల్లను తీసుకున్నాం..దీన్ని ప్రారంభించేటప్పుడే ఐదేళ్లు దాటిన అమ్మాయిలను తీసుకోవాలనే నియమాన్ని పెట్టుకున్నాం. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాం. అయితే ఒకసారి ఎల్బీనగర్‌లో అప్పుడే పుట్టిన పసికందును భవననిర్మాణం జరుగుతోంటే అక్కడే వదిలేశారు. అప్పటికే ఆ అమ్మాయిపై ఇసుక పడింది. మూలుగుతోంది. ఎవరో కూలీ గుర్తించి ఆ పాపాయిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమె దక్కదంటూనే వైద్యం చేశారు. రెండుమూడురోజులకు ఆమె కోలుకున్నాక మా దగ్గరకు తీసుకొచ్చారు. పసిపిల్ల కాబట్టి మేం తీసుకోమని చెప్పాం. కానీ మా కమిటీలో ఆరేడుగురు మహిళలు ఉన్నారు. 'తీసుకుందాం.. తన బాధ్యత మేం చూస్తాం' అన్నారు. ఆ సంఘటన జరిగి ఎనిమిదేళ్లు. ఇలా మానవత్వంతో మా నిబంధనల్ని సవరించుకున్న సందర్భాలూ ఒకటి రెండు ఉన్నాయి. 

కొందరు మా దగ్గరే ఉండి పెళ్లిళ్లు చేసుకుని వెళ్తే.. మరికొందరిని దూరపు బంధువులు వచ్చి తీసుకెళ్తుంటారు. కొందరు పిల్లలకు తల్లీదండ్రీ లేకపోయినా బీమా సదుపాయం ఉంటుంది. సంరక్షకులు ఉంటారు. ఆ వివరాలు తెలిసినప్పుడు బంధువులతో మాట్లాడి వాళ్లని ఇంటికి పంపిస్తాం. అయినప్పటికీ ప్రస్తుతం మా దగ్గర 104 మంది అమ్మాయిలు ఉన్నారు. మేం అందరినీ చేర్చుకోం. కొన్నిసార్లు పోలీసులు తీసుకొస్తుంటారు. వురికొన్నిసార్లు తెలిసినవారు అప్పగిస్తుంటారు. ఎవరో ఒకరి హామీ మీదనే అమ్మాయిల్ని చేర్చుకుంటాం.

చందాలు సేకరించేవాళ్లం..ఇప్పుడంటే ఒక పూట భోజనానికీ, ఒక రోజుకీ, ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటే ఇంత... 

ఇలా ఆర్థిక సాయం అందించే వాళ్లున్నారు. కొందరు దాతలు పప్పు తెచ్చిస్తారు. మరికొందరు వంటకు అవసరమైన నూనె కొనిస్తారు. బియ్యం ఇచ్చే వాళ్లూ, మరోవిధంగా సాయం చేసే వాళ్లూ ఉన్నారు. కానీ దీన్ని ప్రారంభించిన మొదట్లో ఆర్థికసాయం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వారం, పదిహేను రోజులకోసారి వెళ్లి చందాలు సేకరించే వాళ్లం. తెలిసిన వారికి పిల్లల గురించి తెలియజేసి సాయం కోరేవాళ్లం. కొన్నిసార్లు అప్పులు తెచ్చి, వడ్డీలు కట్టిన సందర్భాలూ ఉన్నాయి. అయితే పిల్లల సంఖ్య పెరిగేకొద్దీ మా గురించీ, మేమెంత నిజాయతీగా పనిచేస్తామనేదీ తెలియడంతో చాలామంది సాయం చేయడం మొదలుపెట్టారు. మా ఆశ్రమ అధ్యక్షులు సుందర్‌ రెడ్డి చొరవతో ఇప్పుడు విదేశాల్లో ఉన్నవారూ సాయం చేస్తున్నారు. కొందరు దాతల సాయంతో అద్దె గదుల నుంచి కొన్నేళ్ల క్రితం శాశ్వత బంగళాకు మారాం.

ప్రతిదీ పకడ్బందీగా..

ఈ అమ్మాయిలను చూసేందుకు ఆరేడుగురు మహిళలు వార్డెన్లుగా ఉన్నారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ శిశుమందిర్‌లో చదువు చెప్పిస్తాం. పొద్దున ఐదున్నర నుంచి రాత్రి పది వరకూ.. యోగా, భజన, చదువుకునే సమయం... ఇలా అన్నీ పక్కాగా సాగుతాయి. పదోతరగతి వరకూ అమ్మాయిలు ఇక్కడ ఉంటారు. ఆ తరవాత వాళ్లు కోరుకున్నట్టు ఎంబీఏ అయినా, ఎంటెక్‌ అయినా.. ఎక్కడకు వెళ్లాలన్నా పంపించి మరీ చదివిస్తాం. పదో తరగతి అమ్మాయిల్ని మరో చోట ఉంచుతాం. వాళ్ల అన్ని అవసరాలూ చూస్తాం. దగ్గర్లో కొందరు డాక్టర్లు ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వైద్యం చేస్తారు. వీళ్లకు చదువుతోపాటూ వివిధ అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తాం. పెళ్లిళ్లు చేయాలనుకున్నప్పుడు వచ్చిన ప్రతి సంబంధాన్నీ అంగీకరించం. అబ్బాయి వివరాలు తీసుకుని అన్ని విధాలు వాకబు చేస్తాం. అతని తల్లిదండ్రుల్ని పిలిపించి... ఆశ్రమంలో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారనేది అడిగి తెలుసుకుంటాం. అన్నీ తెలుసుకున్నాకే అమ్మాయిని అబ్బాయికి చూపిస్తాం. తన అభిప్రాయం తీసుకున్నాకే పెళ్లికి తేదీ నిర్ణయిస్తాం. దాతసాయంతో ఏ లోటూ లేకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లిచేసి అత్తింటికి పంపిస్తాం. అంతటితోనే మా బాధ్యత అయిపోదు. ఆ తరవాతా తనెలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం. అలా ఐదేళ్లున్నప్పుడు మా దగ్గరకు వచ్చిన శ్రుతి అనే అమ్మాయికి ఈ మధ్యే పెళ్లిచేసి పంపించాం. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ చదివిన తను ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. మరో అమ్మాయికి పెళ్త్లె బాబు పుట్టాడు. మరో ముగ్గురమ్మాయిలకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాం. మా దగ్గరికొచ్చే అమ్మాయిలకు ఆశ్రయం కల్పించడం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేంత వరకూ చదివించి తరవాత పెళ్లి చేయాలనేదే మా తపన. దాదాపు ఇరవై రెండేళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నాం. వీలైనంత మందికి ఆధారం కల్పించడమే మా లక్ష్యం.- హెచ్‌. శ్రీలక్ష్మి

No comments:

Post a Comment